fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsమూవీ టాక్: కలర్ ఫోటో

మూవీ టాక్: కలర్ ఫోటో

Suhas ColorPhoto MovieTalk

టాలీవుడ్: దసరా పండగ వచ్చిందంటే థియేటర్ లలో కొత్త సినిమాలు విడుదలయ్యేవి.. టిక్కెట్లు దొరకక బ్లాక్ లో అయినా ప్రయత్నాలు చేసి సినిమాలు చూసే వాళ్ళం. కానీ పరిస్థితులు మారి ఇపుడు కొత్తగా విడుదలైన సినిమాల్ని ఓటీటీల్లో చూడాల్సివస్తోంది. ఈ దసరాకి విడుదలైన ఏకైక తెలుగు సినిమా ‘కలర్ ఫోటో’. ఈ సినిమా ఇవాళ ఆహా ఓటీటీ లో విడుదలైంది. మొత్తం కొత్త టీం రూపొందించిన ఈ సినిమా టీజర్స్, ట్రైలర్, పాటల ద్వారా మంచి బజ్ తోనే విడుదలైంది.


సినిమా కథ విషయానికి వస్తే పేద అబ్బాయి, పెద్దింటి అమ్మాయి.. వీళ్లిద్దరు కాలేజీ లో ప్రేమించుకోవడం, వీళ్ళ ప్రేమని పెద్దలు ఒప్పుకోకపోవడం. ఈ కథ చాలా సినిమాల్లో చూసి చూసి ఉన్నాం. కానీ ఎందుకు ఒప్పుకోలేదు అనే పాయింట్ ని దర్శకుడు వేరే విధంగా తీసుకెళ్లాడు.
తమ క్రియేటివిటీ ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నిరూపించుకున్న ఒక కొత్త టీం నుండి ఇలాంటి ఒక కథతో రావడం ముందు ఆశ్చర్యం అనిపించింది. కానీ దర్శకుడి కథనం, రాసుకున్న మాటలని బట్టి దర్శకుడి పనితనం తెలుస్తుంది.

టెక్నిషియన్స్ విషయానికి వస్తే ఈ సినిమా కథ మామూలు కథే అయినా కూడా తాను రాసుకున్న మాటలు , హాస్యంతో ముందుకు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఇండస్ట్రీ లోకి వచ్చే కొత్త డైరెక్టర్ లు కొన్ని సీన్స్ ఇలా చెయ్యాలి ఇలా ఉంటె బాగుంటది.. అని చాలా సీన్స్ రాసుకుంటారు. ఈ సినిమా చూస్తే అలాంటివి అనుభవించినవారికి చాలా వరకు కనెక్ట్ అవుతారు. ఆ సీన్స్ చూసినపుడు అర్ధం అవుతుంది దర్శకుడికి తాను అనుకున్నంత ఫ్రీడమ్ దొరికింది అని. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ లో మొదట ఎలా ప్రేమ లో పడ్డారు అనే ఒక సీన్ చెప్పే విధానం కొత్తగా అనిపించింది. ఇంకా మాటల విషయానికి వస్తే డైరెక్టర్ సందీప్ రాజ్ ని ఈ విషయంలో మెచ్చుకోకుండా ఉండలేం. సినిమా ప్రారంభం అయిన మొదట్లో చాందిని చౌదరి పాత్ర కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది.. కానీ మధ్యలో ‘వెక్కి వెక్కి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయిన వాళ్ళు కూడా ఉంటారు’ అనే ఒక డైలాగ్ ద్వారా తన పాత్ర ఏంటి అని చెప్పేసాడు. మళ్ళీ సినిమా చివర్లో మాత్రమే తాను ఏడుస్తుంది.. తాను రాసుకున్న పాత్రలు అంత బలంగా రాసుకున్నాడు. ‘వాళ్ళ దేవుడు గోకులం లో కాపరి.. మా దేవుడు జేరు సేలం లో కాపరి అయినా కూడా మాతో కలవారు’, ‘ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ’, ‘ఒకర్ని ఒకరు సపోర్ట్ చేసుకొని ఇంకొకరిని హీరోని చెయ్యడం కథల్లోనే బాగుంటాయి’.. ఇలాంటి డైలాగ్స్ తో సినిమాలో మాటలు చాలా బాగా రాసుకున్నాడు. చాలా వరకు డైరెక్టర్ పనితనం బాగానే ఉన్నా ఇంకొంచెం అసంతృప్తి మిగులుతుంది. సందీప్ రాజ్ తర్వాత ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరొక పేరు ‘కాల భైరవ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాల భైరవ గురించి ‘వాళ్ళ నాన్న పేరు నిలబెట్టడానికి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నాడు’ అని ఒక మాట చెప్పారు. అతని కష్టం ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా పాటలు ఒక ఎత్తు అయితే కొన్ని కొన్ని సీన్స్ లలో మామూలు సన్నివేశం కూడా తన రీ-రికార్డింగ్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు ఆనందం లో సందేహం లేదు. ఎడిటర్ పవన్ కళ్యాణ్ , సినెమాటోగ్రాపర్ వెంకట్ మరియు మిగతా టెక్నిషియన్స్ తమ తమ పరిధుల్లో బాగానే చేసారు. నిర్మాణ విలువలు పరవాలేదు. 1997 కథని బట్టి ఆ సెటప్ ప్రకారం బాగానే చేసారు.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా కథ ‘సుహాస్‘ కి సరిగ్గా కుదిరింది అని చెప్పవచ్చు. సుహాస్ ని హీరో చేయడం కోసం సందీప్ ఈ కథ రాసుకున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో సుహాస్ ని చూసాక వేరే హీరోని ఊహించలేం. ఈ సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ కి ఇంకో నాచురల్ స్టార్ దొరికాడు అని చెప్పవచ్చు. తన నటన తో ప్రతీ సన్నివేశాన్ని ఆకట్టుకున్నాడు. చాందిని చౌదరి కూడా బాగానే చేసింది. కానీ తన డబ్బింగ్ లోనే కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సింది అనిపించింది. హీరో హీరోయిన్ ల తర్వాత చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన పాత్ర ‘వైవా హర్ష’. ఇప్పటి వరకు అతని కెరీర్లో బెస్ట్ అని కూడా చెప్పవచ్చు. సుహాస్ బెస్ట్ ఫ్రెండ్ గా అద్భుతంగా నటించాడు అని చెప్పవచ్చు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన సీనియర్ కమెడియన్ ‘సునీల్’ కూడా పరవాలేదనిపించింది. కానీ సునీల్ ని వేరొక లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ఐతే ఇది కాదనిపించింది. యు ట్యూబ్ షార్ట్ వీడియోలు చూసే వారికీ ఇందులో నటీనటులు సుపరిచితమే. ఎవరికీ వాళ్ళు వారి పాత్రల్లో బాగానే చేసారు.

చివరగా చెప్పాలంటే కాలభైరవ సంగీతం, సందీప్ రాజ్ మాటలు, సుహాస్ నటన గుర్తుండిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular