టాలీవుడ్: బాలీవుడ్ వెటరన్ ఆక్టర్ సునీల్ శెట్టి అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. చివరగా రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఇపుడు మరోసారి సౌత్ లో ఒక పవర్ ఫుల్ రోల్ లో నటించబోతున్నాడు. మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రలుగా ఒక పెద్ద ఐటీ స్కాం కి సంబందించిన చిత్రంగా ‘మోసగాళ్లు’ అనే సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఒక ముఖ్య మైన పాత్రలో నటిస్తున్నాడు అని ఆయనకీ సంబందించిన టీజర్ కూడా విడుదల చేసింది సినిమా టీం.
అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ కుమార్ పాత్రలో సునీల్ శెట్టి ఈ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగులో సునీల్ శెట్టి కి ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో జరిగే పెద్ద ఐటీ స్కామ్ ని ఇన్వెస్టిగేట్ చేసే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు సునీల్ శెట్టి. ‘నా జోన్ లో ఎవడైనా తప్పు చేస్తే వాడి లైఫ్ ఇంక డేంజర్ జోనే..వాడు ఎంత తోపైనా నేను వదిలిపెట్టను’ అంటూ సునీల్ శెట్టి డైలాగ్స్ తో ఉండే ఒక టీజర్ ని విడుదల చేసారు మేకర్స్. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల చెయ్యనున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై మంచు విష్ణు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జెఫ్రీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవబోతున్నాడు.