హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ దాడి ఇంకా కొనసాగుతూనె ఉంది. రోజుకు 3 నుండి 4 లక్షల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలు కూడా 3 నుండీ 4 వేళ మధ్య నమోదవుతున్నాయి. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో మరణాల రేటు పెరుగుతోంది.
ఆక్సిజన్ కొరత కూడా చాలా మరణాలకు కారణమవుతోంది. ఈ తరుణంలో ఎందరో ఆక్సిజన్ కోసం మరియు కోవిడ్ సౌకర్యాల కోసం విరాళాలు అందిస్తున్నారు. అదే విధంగా మహమ్మారి పై భారత్ పోరులో భాగంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవాళ భారీ విరాళం ప్రకటించింది.
సన్రైజర్స్ తన వంతు సాయంగా రూ. 30 కోట్ల రూపాయలను కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ లో ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా ప్రభావితమైన బాధితులకు అండగా ఉండేందుకు సన్ టీవీ నెట్‌వర్క్ రూ. 30 కోట్లను విరాళంగా ఇవ్వనుందని తెలిపింది.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతున్న వివిధ కార్యక్రమాలకు ఈ నిధులను ఉపయోగించనున్నాం. ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్ సరఫరా నిమిత్తం ఎన్జీఓలతో భాగస్వామ్యమై ముందుకు సాగుతాం. అంతేకాదు మీడియా ద్వారా కరోనా వ్యాప్తి అడ్డుకట్టకై తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం అని పేర్కొంది.