అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 రెండవ క్వాలిఫయర్ కు అర్హత సాధించింది. టోర్నీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ లో కేవలం ఏబీ డివిలియర్స్ మాత్రమే (43 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఫించ్ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) కాస్త ఫర్వాలేదనిపించాడు. హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ విలియమ్సన్ (44 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేసన్ హోల్డర్ (20 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరం చేర్చారు.
ఈ జంట ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 65 పరుగులు జోడించడం విశేషం. ఆదివారం జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఎలాంటి భారీ షాట్లకు అవకాశం ఇవ్వలేదు.
ఇద్దరు అనుభవగ్నులైన సీనియర్ ఆటగాళ్ళు కలిసి చక్కటి సమన్వయంతో, పరిస్థితికి తగినట్లుగా ఆడుతూ ముందుకు వెళ్లారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా విలియమ్సన్, హోల్డర్ ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించలేదు. తమ పని తాము చేసుకుని హైదరాబద్ కు విజయాన్ని అందించారు.