అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజారోగ్య ముఖచిత్రం మారిపోనుంది. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం మరింత చేరువ కానుంది. అర్ధరాత్రో అపరాత్రో పేషెంటు వెళితే ఎవరూ అందుబాటులో లేరన్న విమర్శలకు ఇక నుంచి తావుండదు. పేద రోగులకు నూతన సంవత్సర కానుకగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈనెల నుంచి 24 గంటలూ పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఈ విషయంపై మరో రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అవనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఔట్‌పేషెంటు సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వస్తే డాక్టర్‌కు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకుంటారు. దీనికి తోడు ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రతి రెండువేల కుటుంబాలకు ఒక వైద్యుడు బాధ్యుడుగా ఉంటారు. కేరళ, తమిళనాడు తరహాలో ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసే దిశగా చర్యలు పూర్తయ్యాయి.
ఏపీలో ప్రస్తుతం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతి పీహెచ్సీలోను ఇద్దరు వైద్యులు ఉండేలా నియామకాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. వైద్యసేవలతో పాటు రక్తపరీక్షలు కూడా అక్కడే చేసి వైద్యం అందిస్తారు. రాత్రిపూట వైద్యానికి వస్తే డాక్టర్‌కు ఫోన్ చేస్తే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్‌టెక్నీషియన్, స్టాఫ్ నర్సులు ఇలా అందరూ అందుబాటులో ఉంటారు. ప్రాథమిక వైద్యానికి సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతారు.
ఇప్పటివరకు పీహెచ్‌సీల్లో కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే లభించేది. కానీ ఇకమీదట ఆరురకాల స్పెషాలిటీ వైద్యసేవలు అందించబోతున్నారు. ఈఎన్టీ, డెంటల్, కంటిజబ్బులు, మెంటల్ హెల్త్, గేరియాట్రిక్, గైనకాలజీ సేవలు అందిస్తారు. ఒక్కో స్పెషాలిటీకి ఒక్కోరోజు చొప్పున ఆరురోజులు ఆరుగురు స్పెషాలిస్టు డాక్టర్లు ఔట్‌పేషెంటు సేవలు అందిస్తారు.