తిరుమల: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై జరిగిన వివాదం రాజకీయ దుమారం రేపింది. సెప్టెంబర్ 30, 2024న సుప్రీంకోర్టు ఈ వివాదంపై పలు పిటీషన్లపై విచారణ జరిపింది. విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయగా, ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా సిట్ (Special Investigation Team) విచారణకు బ్రేక్ వేస్తూ నిర్ణయం తీసుకుంది.
డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటన ప్రకారం, ఈ విచారణను అక్టోబర్ 3వ తేదీ వరకూ వాయిదా వేస్తున్నామని, తదుపరి దర్యాప్తు సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా జరుగుతుందని వెల్లడించారు. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సిట్ వేశామని, కోర్టు తీర్పు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు విచారణలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. “దేవుడిని రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలి” అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో సీఎం చంద్రబాబు ఇరకాటంలో పడినట్లు భావిస్తున్నారు. ఈ వివాదంపై తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది.
సిట్ దర్యాప్తు:
ప్రభుత్వం ఈ వివాదాన్ని సీరియస్‌గా తీసుకొని, విచారణ కోసం సిట్‌ను నియమించింది. సెప్టెంబర్ 28న సిట్ బృందం తిరుమలలో విచారణ మొదలు పెట్టి మూడు రోజుల పాటు దర్యాప్తు చేసింది. ప్రాథమికంగా నెయ్యి కొనుగోలుకు సంబంధించిన సమాచారం సేకరించి, టీటీడీ అధికారులతో సమావేశమైంది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు వరకూ సిట్ దర్యాప్తు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.