న్యూఢిల్లీ: లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు స్పందన! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ మరియు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా దీనిపై పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది.
విచారణ సమయంలో, సుప్రీంకోర్టు ఈ అంశం కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినదని, ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని వెల్లడించే ముందు నిర్దిష్ట ఆధారాలు ఉంటేనే మాట్లాడాల్సిందని వ్యాఖ్యానించింది.
దేవుడు, మతపరమైన వ్యవహారాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని, ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి ప్రజా వేదిక ద్వారా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ధర్మాసనం పేర్కొంది.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలకు సంబంధించి, ఆధారాలు ఏమిటని సుప్రీం న్యాయమూర్తులు ప్రశ్నించారు.
ఈ విచారణలో టీటీడీ తరఫున న్యాయవాది జూన్ నుంచి జులై వరకు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వినియోగించారన్న వివరాలను కోర్టుకు అందజేశారు.
లడ్డూ నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల అనంతరం అధికారులు దర్యాప్తు నిర్వహించి, నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ ఫుడ్స్ ట్యాంకర్లను పరీక్షించారని, ఆ నివేదిక ఆధారంగా లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు నిర్ధారణకు వచ్చారని తెలిపారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, కేవలం ఒక ల్యాబ్ నివేదిక ఆధారంగా కాకుండా ఘజియాబాద్, మైసూర్ వంటి ఇతర ల్యాబ్‌లలో కూడా శాంపిల్స్‌ని పరీక్షించాల్సిందని సూచించింది.
దర్యాప్తు పూర్తికాకముందే కల్తీ వాడారనే నిర్ధారణకు ఎలా వచ్చారు అని ప్రశ్నించింది. ఈ విచారణను అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది.