ఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసుల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణలు జరుపుతున్నాయి.
2024 ఆగస్ట్ 9న సుప్రీంకోర్టు సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసి, కీలక వ్యాఖ్యలు చేసింది.
“సిసోడియా 17 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారని, ఇంకా విచారణ ప్రారంభం కాకపోవడంపై కోర్టు సీబీఐని ప్రశ్నించింది. 2023 ఫిబ్రవరి 26న సిసోడియా CBI కస్టడీలోకి తీసుకోబడారు మరియు మార్చి 9న అరెస్ట్ చేయబడ్డారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అతని హక్కులను హరించారంటూ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.”
న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సిసోడియాకు రూ. 10 లక్షల బెయిల్ బాండ్‌తో పాటు రెండు పూచీకత్తులు సమర్పించాలని, పాస్‌పోర్టును అప్పగించాలని, వారానికి రెండు సార్లు సోమ, గురువారాల్లో విచారణ అధికారి ముందు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడానికి లేదా సాక్ష్యాలను తారుమారు చేయడానికి అతను ఎటువంటి ప్రయత్నం చేయరాదని పేర్కొంది.
ఇదే కేసులో సిసోడియా ఇప్పటికే మూడు సార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత సంవత్సరం, అక్టోబర్ 30న అత్యున్నత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.
17 నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ తో తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. ఇదే కేసులో ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్, కవిత ఇంకా తీహార్ జైలులోనే ఉన్నారు.