హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసిందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది.
ఈ కేసులో ఆర్‌బీఐ ని సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది. ఇప్పటికే ప్రతివాదులుగా ఉన్న రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వాలు సహా ఆర్‌బీఐకి కూడా సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీచేసింది. మార్గదర్శి సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందన్న అభియోగాలతో ట్రయల్ కోర్టులో దాఖలైన క్రిమినల్ కంప్లయింట్‌ను ఉమ్మడి హైకోర్టు తన చివరి పని దినం రోజున కొట్టేస్తూ ఇచ్చిన తీర్పును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సవా లు చేశారు.
ఆయన తరఫున మెస్సర్స్ రమేష్ అల్లంకి అండ్ అసోసియేట్స్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అప్పీలు చేయనందున తాను ఎస్సెల్పీ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలన్న అభ్యర్ధనకు ధర్మాసనం అనుమతించింది. అలాగే, ఎస్సెల్పీలోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది.
2020 జనవరి 24న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేసింది, ఇప్పుడు ఆర్బీఐను ప్రతివాదిగా చేర్చింది. అలాగే, జీఓ 801 ద్వారా అప్పటి సీఐడీ ఐజీ కృష్ణరాజును మార్గదర్శి సంస్థపై ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 45(టి), సెక్షన్ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసేందుకు అధీకృత అధికారిగా నియమించినందున కృష్ణరాజును ప్రతి వాదిగా చేర్చాలన్న పిటిషనర్ అభ్యర్థన మేరకు కృష్ణరాజును కూడా ప్రతివాదిగా చేర్చింది.