న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం సుదీర్ఘ ఉద్యమం చేస్తున్న రైతులు, రైతు సంఘాలకు సూప్రీం ద్వారా భారీ ఊరట లభించింది. మూడు వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం చట్టాల అమలును నిలిపి వేయాలని లేదంటే తామే ఆ చట్టాలపై స్టే విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఈ చట్టాల పరిశీలనకు గాను సూప్రీం కోర్టు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. దానితో పాటు రైతులు తమ నిరసనను కొనసాగించుకోవచ్చని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాల పై స్టే ఇచ్చిన తర్వాత ఆందోళన నిలిపి వేస్తారా ? అని సుప్రీం రైతు సంఘాల ఉద్యమ నేతలను ప్రశ్నించింది. తదుపరి వాదనలను మంగళవారం వాయిదా వేసింది.
ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మక సమస్యగా ఎందుకు చూస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా కేంద్ర వైఖరిపై తాము అసంతృప్తితో ఉన్నామన్నారు. రైతుల ఆందోళన, సమస్యను పరిష్కరించడంలో సరిగా వ్యవహరించలేదని అన్నారు. పలు దఫాలు చర‍్చలు విఫలంపై స్పందిస్తూ కేంద్రం పరిస్థితిని సరిగ్గా నిర్వహిస్తోందని, చర్చలు ప్రభావవంతంగా ఉన్నాయని తాము విశ్వసించడలేదంటూ ఘాటుగా స్పందించారు.
అందుకే చట్టాల అమలును నిలిపివేయడం ద్వారా వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతు సంఘాలతో ప్రభుత్వ చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య సీజేఐ వ్యాఖ్యలు ప్రాధన్యతను సంతరించుకున్నాయి.