కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కొత్త చిత్రం రెట్రో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రాబోతోంది. పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది.
ఇప్పటికే సినిమా గ్లింప్స్ విడుదలై, మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా, ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, తెలుగులో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని సితార ప్లాన్ చేస్తోంది.
సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, రీసెంట్‌గా వచ్చిన కంగువా సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీంతో, రెట్రో సినిమా విజయం సాధిస్తే, సూర్యకు తెలుగులో మరింత క్రేజ్ పెరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదే సమయంలో సితార బ్యానర్‌పై సూర్య త్వరలోనే ఓ డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నట్లు టాక్. అందుకే, రెట్రో సినిమాను తెలుగులో బలంగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
మొత్తానికి, రెట్రో హిట్ అయితే, సూర్యకు తెలుగులో భారీగా మార్కెట్ పెరగనుంది. మరి, ఈ సినిమా సూర్యకు తిరుగులేని హిట్ ఇస్తుందా? లేదా? వేచి చూడాలి.