సిరియా అంతర్యుద్ధం ఎందుకు ఎలా మొదలైంది? దానికి గల ప్రధాన కారణాలు ఏమిటి?
చారిత్రక నేపథ్యం
సిరియా ప్రపంచంలోని అత్యంత ప్రాచీన చారిత్రాత్మక దేశాల్లో ఒకటి. టర్కీ, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో సరిహద్దులు కలిగిన ఈ దేశం, అనేక సామ్రాజ్యాల ఆధిపత్యం చూసింది. అయితే 2011లో ప్రారంభమైన అంతర్యుద్ధం ఈ దేశాన్ని విధ్వంసానికి గురి చేసింది. ఈ సుదీర్ఘ అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి.
1. కుటుంబ పాలనపై తిరుగుబాటు
1970 నుంచి 2000 వరకు హోఫెజ్ అల్ అసద్ సిరియాను పాలించారు. ఆయన మరణానంతరం తన కుమారుడు బషర్ అల్ అసద్ పాలన చేపట్టారు. కుటుంబ పాలన సుదీర్ఘ కాలం కొనసాగడంతో ప్రజల హక్కులు కాలరాయబడ్డాయని కొందరి వాదన. 2011లో ప్రజలు రాజకీయ స్వేచ్ఛ, సమానత్వం కోరుతూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసి సివిల్ వార్‌ను ప్రేరేపించాయి.
2. ఆర్థిక అసమతుల్యత
సిరియాలో పేదరికం, నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నీటి కొరత కారణంగా పంటల ఉత్పత్తి తగ్గుదల, ఆహార ధరల్లో పెరుగుదల ప్రజల జీవనోపాధిని దెబ్బతీసాయి. 2006–2011 మధ్య కాలంలో వచ్చిన కరువు పరిస్థితి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెంచింది. ఈ అంశాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించి, పాలక పక్షంపై తిరుగుబాటుకు కారణమయ్యాయి.
3. మతపరమైన విబేధాలు
సిరియాలో సున్నీ ముస్లింలు 70%, షియా ముస్లింలు 13% ఉన్నారు. బషర్ అల్ అసద్ అలవీట్స్ అనే షియా వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మత పరమైన విబేధాలు తారస్థాయికి చేరాయి. సున్నీ వర్గాలు అసద్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాయి. ఈ విబేధాలు అంతర్యుద్ధాన్ని మరింత తీవ్రమయ్యేలా చేశాయి.
4. ఉగ్రవాద సంఘాల ప్రభావం
సిరియాలో ఐసిస్, ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు కీలక పాత్ర పోషించాయి. 2013లో ఐసిస్ సిరియాలో అడుగుపెట్టి, సున్నీ రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నించింది. రష్యా, అమెరికా, టర్కీ వంటి దేశాలు ఐసిస్‌ను అడ్డుకుని, 2019 నాటికి దాదాపు నాశనం చేశాయి. అయితే వీటి ప్రభావం సిరియాలో హింసను మరింత విస్తరించింది.
5. విదేశీ జోక్యం
వారి వారి అంతర్జాతీయ ప్రయోజనాల కోసం వివిధ దేశాలు సిరియాలో జోక్యం చేసుకున్నాయి.
- అమెరికా: అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది.
- రష్యా: అసద్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి, వ్యతిరేక శక్తులను అణచి వేసి మధ్యప్రాచ్యంలో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది.
- ఇరాన్: షియా వర్గం మద్దతు దారుగా ఉన్న అసద్ ప్రభుత్వానికి సహకరిస్తోంది.
- టర్కీ, సౌదీ అరేబియా: సున్నీ వర్గాలకు మద్దతుగా నిలిచి అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.
వీటితో పాటు ఖతార్, ఇతర దేశాలు సిరియాలో తమ ప్రాబల్యం కోసం పాకులాడుతున్నాయి. ఈ విదేశీ జోక్యం సిరియాలో పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసింది.