ముంబై: 2008 ముంబై 26/11 ఉగ్రదాడి నేపథ్యంలో తహావుర్ హుస్సేన్ రాణా కీలక కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు అతడి భారత్‌కు అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించి, ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకున్నారు.
తహావుర్ రాణా పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్‌గా సేవలందించి 1997లో రిటైర్ అయ్యాడు. అనంతరం కెనడా పౌరసత్వం పొంది అమెరికాలో వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. ఇదే సమయంలో ముంబై దాడులకు మరో కీలక వ్యక్తి డేవిడ్ హెడ్డ్లీతో సంబంధాలు ఏర్పడిన రాణా, అతడికి సహాయం చేసినట్టు ఎఫ్‌బీఐ దర్యాప్తులో వెల్లడైంది.
హెడ్డ్లీకి ప్రయాణ పత్రాలు కల్పించడమే కాక, ముంబైలో రెక్కీ చేయడానికి సహకరించడం వంటి చర్యల ద్వారా రాణా ప్రణాళికల్లో భాగమైనట్టు గుర్తించారు. 2009లో అమెరికా అధికారులు అతన్ని అరెస్టు చేయగా, 2020లో భారత్ అప్పగింత కోరింది.
ప్రస్తుతం పాటియాలా కోర్టులో విచారణ కోసం ఏర్పాట్లు జరుపుతున్నారు. కేంద్రం ప్రత్యేక బందోబస్తుతో పాటు నరేందర్ మాన్ అనే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. ఈ కేసు విచారణతో పాక్ ఐఎస్ఐ పాత్ర, లష్కరే తోయిబాతో సంబంధాలపై మరిన్ని రహస్యాలు బహిర్గతం అయ్యే అవకాశముంది.