fbpx
Saturday, January 18, 2025
HomeTelanganaభారీ లంచం తీసుకుంటూ దొరికిన కీసర తహసీల్దార్

భారీ లంచం తీసుకుంటూ దొరికిన కీసర తహసీల్దార్

TAHSILDAR-CAUGHT-REDHANDED-TAKING-1CRORE-BRIBE

హైదరాబాద్‌ : తెలంగాణ లోని కీసర రెవెన్యూశాఖలో ఓ భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలలో పడింది. రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. భూమికి సంబంధించి రికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్‌బుక్‌ ఇవ్వడం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఆయన డబ్బులు డిమాండ్‌ చేశాడు.

కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన సర్వే నంబర్‌ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టులో కేసు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఒక వర్గానికి అనుకూలంగా రికార్డులు తయారుచేయడానికి తహసీల్దార్‌ రూ.2 కోట్ల లంచం డిమాండ్‌ చేసినట్టు సమాచారం.

ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఎస్‌రావు నగర్‌లోని తన ఇంటివద్ద మొదటి విడతగా రూ.కోటీ 10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంపల్లి దాయర గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి, వరంగల్‌కు చెందిన శ్రీనాథ్‌ యాదవ్‌తోపాటు రాంపల్లి వీఆర్‌ఏ సాయిరాజ్‌ తహసీల్దార్‌కు సహకరించినట్లు సమాచారం. ఈ ముగ్గురినీ కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సదరు తహసీల్దార్‌ పై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్‌పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్‌ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు.

ఇటీవల కీసర మండలంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చాలా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే ప్రజల నుంచి అధిక మొత్తంలో లంచాలు డిమాండ్‌ చేస్తునట్టు ఆరోపణలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular