తైపీ: తైవాన్ ప్రభుత్వం కరోనా వైరస్ పై పోరులో కీలక ముందడుగు వేసింది. ఈ మహమ్మారి నిరోధక వాక్సిన్ల కొరత వేధిస్తున్న వేళ తైవాన్ స్థానికంగా తయారైన మెడిజెన్ టీకాను అత్యవసరంగా వినియోగించడానికి అనుమతినిస్తున్నట్లు ఇవాళ తెలిపింది. ఈ మెడిజెన్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ లాగే చాలా ప్రభావ వంతంగా పనిచేస్తూ, మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైందని తెలిపింది.
తైవాన్ ఆరోగ్య శాఖ మరియు దేశ నిపుణుల బృందం మెడిజెన్ టీకా ఎమర్జెన్సీ వినియోగానికి ఆమోదం తెలిపింది. ఈ టీకా వినియోగంలో అంతగా ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదని స్పష్టం చేసింది. ఆగష్టు మొదటి వారం నుంచే టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందిని ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో తైవాన్ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షిహ్- చుంగ్ మాట్లాడుతూ, అతి తొందరలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం కూడా పెంచబోతున్నట్లు మెడిజెన్ తెలిపిందని ఆయన అన్నారు. దేశంలో వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేస్తామని ప్రకటించారు. కాగా ఎమ్‌వీసీ-కోవ్1901 పేరుతో మెడిజెన్ వాక్సిన్ బయోలాజిక్స్ కార్పొరేషన్ కోవిడ్ టీకాను ఉత్పత్తి చేస్తోంది.
మెడిజెన్ వ్యాక్సిన్ రెండవ దశ ప్రయోగాల్లో ఆసించిన సత్ఫలితాలు వచ్చాయని, క్లినికల్ ట్రయల్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉందని సదరు కంపెనీ ఇటీవలే ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ వ్యాక్సిన్ 20 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే రెండు డోసుల్లో టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది.
అయితే చైనా మెయిన్‌లాండ్‌లో భాగమైన తైవాన్‌లో గత ఏడాది తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ కరోనా సెకండ్‌వేవ్‌లో దేశంలో ఎయిర్‌లైన్ పైలెట్ల ద్వారా కోవిడ్ వ్యాప్తి తీవ్రమై, సుమారు 800 మంది మరణాలకు దారితీసింది. ఇక ఇప్పటికే తైవాన్ స్వతంత్ర భావజాలంపై చైనా ఇప్పటికే కన్నెర్ర చేస్తున్న విషయం తెలిసిందే.
అలాగే తమకు అండగా ఉన్న అమెరికా ఇప్పటికే తైవాన్ కు 25 లక్షల వ్యాక్సిన్ డోసులను, జపాన్ 3.37 మిలియన్ టీకా డోసులను విరాళంగా ఇచ్చినట్లు తెలిపింది. అలాగే ఫోక్సోకాన్ అండ్ తైవాన్ సెమికండక్టర్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ సైతం 5 మిలియన్ వాక్సిన్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా మొత్తం 23 మిలియన్ జనాభా కలిగిన తైవాన్ ప్రస్తుతం స్థానికంగా తయారైన టీకా వాడకానికి ఆమోదం తెలపడం ద్వారా వాక్సినేషన్‌ను వేగవంతం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.