తైపీ, తైవాన్: ప్రపంచంలో చాలా దేశాల్లో ఇప్పటికీ కరోనా ఉధృతి ఆగలేదు. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి. ఈ సమస్యలు ఇలా ఉండగనే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచమంత్నిఆ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. అయితే ప్రారంభంలో కంటే కూడా సెకండ్ వేవ్‌లో పరిస్థితులు భయంకరంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిన్న దేశం ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది.
23 మిలియన్ల జనాభాలో కేవలం 553 మందికే వైరస్ సోకడం, ఏడుగురు మాత్రమే చనిపోవడం వంటి విషయాలు అగ్రదేశాలను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఎంటంటే గత 200 రోజులుగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం. ఏప్రిల్ 12న చివరి కోవిడ్ కేసు నమోదు అయ్యింది. శుక్రవారం వరకు స్థానికంగా (201 రోజులు) ఒక్క కేసు కూడా నమోదు లేదు. ఆ దేశం పేరు తైవాన్.
వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచే తైవాన్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ ప్రయాణాలు బంద్ చేసింది. చాలా పక్కగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడమే కాక మాస్క్ ధరించడం విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా ఉంది. గతంలో సార్స్‌తో పోరాడిన అనుభవం కూడా బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం తైవాన్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అసలే లేదని అంటు వ్యాధి వైద్యుడు మరియు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ పీటర్ కొల్లిగ్నాన్ తెలిపారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరితం ప్రమాదకరంగా ఉంటుందని ఇప్పటికే రుజువు అవుతోంది. అమెరికాలో గురువారం నమోదయిన కేసులతో కొత్త రోజువారీ రికార్డును నెలకొల్పింది. ఒక్క రోజులో 86,000 కేసులతో అగ్రస్థానంలో ఉంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మిన్నెసోటాలో కేసులు చాలా పెరిగాయి, టెక్సాస్‌లో వ్యాప్తి వేగవంతమైంది.
శుక్రవారం నుంచి తిరిగి లాక్‌డౌన్‌లోకి వెళ్లేందుకు ఫ్రాన్స్ సిద్ధమయయ్యింది. ఆర్థిక కార్యకలాపాలను 15 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి బ్రూనో లే మైర్ తెలిపారు. జర్మనీలో కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఇక ఆర్థికంగా కూడా ఈ ఏడాది అన్ని దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా తైవాన్ మాత్రం ఆర్థికంగా ఎంతో మెరుగ్గా ఉంది.