కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకున్న తరువాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాలిబన్ అధికార ప్రతినిధి అయిన జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, 20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని మేము తరిమికొట్టాం అన్నారు. మేము అంతర్గతంగా మరియు బయట నుండి ఎటువంటి శత్రుత్వం కోరుకోవడంలేదన్నారు.
దేశంలో మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వమని అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తాము అందరినీ క్షమించినట్లు, ఎవరి మీదా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పారు. ప్రజల ఇళ్లలో సోదాలు మరియు దాడులు కూడా ఉండవని వెల్లడించారు.
అలాగే అఫ్గన్‌లో నివసిస్తున్న ఇతర దేశస్తులకు కూడా ఎటువంటి హాని తలపెట్టబోమని, కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నవారు కూడా వెనక్కి రావాలని కోరారు. అలాగే దేశంలో ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని రకాల హక్కులు కల్పిస్తాం అలాగే ఎలాంటి వివక్ష కూడా చూపబోం అని స్పష్టం చేశారు.
ప్రజలకు వైద్య, ఇతర రంగాలలో వారు పనిచేసుకోవచ్చు, అలాగే మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించం అని ముజాహిద్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు స్థానిక టోలోన్యూస్‌తో మాట్లాడుతూ తాము అవలంబించబోయే వైఖరి గురించి మంగళవారం ప్రకటించారు.
దేశంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ముజాహిద్ తెలిపారు. కానీ మీడియాకు ఆయన మూడు కీలక సూచనలు చేశారు. ఏ ప్రసారమూ ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ఉండకూడదుని, నిష్పక్షపాతంగా ఉండాలి అని అన్నారు. దానితో పాటు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏదీ ప్రసారం చేయకూడదని తెలిపారు. ప్రజల జీవనోపాధిలో మెరుగుదలకు పూర్తి కృషిచేస్తాం అని హామీ ఇచ్చారు.