టాలీవుడ్: బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఇక్కడి సినిమాలపై అంచనాలు పెరగడమే కాకుండా వేరే బాష హీరోలు కూడా ఇక్కడ తమ మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే ఇక్కడి డైరెక్టర్ తో పని చేయడం, ఇక్కడే డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వేరే బాష డైరెక్టర్ లు కూడా ఇక్కడ హీరోలతో సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా తమిళ హీరోలకి తెలుగులో కొంత మార్కెట్ ఉంది. వాళ్ళు హీరోగా రూపొందే సినిమాలు దాదాపు ఇక్కడ డబ్ అవుతాయి. ఎంత కాదన్న కొంత మంది వీళ్ళ సినిమాలు చూస్తారు. ఇలా ఇక్కడ మార్కెట్ ఎక్కువ ఉన్న హీరోల్లో సీనియర్ హీరోలు రజిని కాంత్, కమల్ హాసన్ తర్వాత సూర్య, కార్తీ ముందు వరుసలో ఉంటారు. కార్తీ ఇదివరకే వంశీ పైడిపల్లి తో డైరెక్ట్ తెలుగు సినిమా చేసారు. అంతే కాకుండా తన ప్రతి సినిమాని ఇక్కడ డబ్ అయ్యేట్టు చూసుకుంటాడు, తన పార్ట్ కి తెలుగు లో తానే డబ్ చెప్పుకుంటాడు కూడా. మరో హీరో సూర్య కి కూడా తెలుగులో గట్టి మార్కెట్ ఉంది. చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు కానీ డైరెక్ట్ తెలుగు సినిమా చేసే టైం ఈ హీరోకి రావట్లేదు.
వీళ్ళ తర్వాత తెలుగులో ఈ మధ్య మార్కెట్ పెంచుకున్న మరో నటుడు విజయ్. ప్రస్తుతం ఈ హీరో తమిళ్ లో టాప్ రేంజ్ లో ఉన్నాడు. తెలుగు లో కూడా మార్కెట్ పెంచుకునేందుకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో సినిమా రూపొందిస్తున్నాడు. వీరి తర్వాత తెలుగు లో మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్న మరో నటుడు ధనుష్. రఘువరన్ బి.టెక్ సినిమా తర్వాత ధనుష్ కి కూడా ఇక్కడ ఇమేజ్ బాగానే పెరిగింది. హిందీ , ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ హీరో మొన్ననే తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో సినిమా ప్రకటించి ఆశ్చర్యపరచాడు.
ఇలా దాదాపు తమిళ్ లో గుర్తింపు ఉన్న పెద్ద హీరోలు ఎదో ఒక రకంగా తెలుగులో మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు మల్టీ స్టారర్ మార్గాన్ని ఎంచుకుంటే, కొందరు డబ్బింగ్, కొందరు తెలుగు డైరెక్టర్ సినిమాలు.. ఇలా రక రకాలుగా ఇక్కడ పాగా వేసే ప్రయత్నాలు చేస్తున్నారు.