న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన విమానయాన రంగ దిగ్గజం ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో తాజాగా టాటా గ్రూప్ బరిలో నిలిచింది. మరోపక్క ఎయిర్ ఇండియా ఉద్యోగులు సైతం కంపెనీ కొనుగోలుకి ఆసక్తిని వ్యక్తం చేయడం గమనార్హం. భారీ రుణ భారంతో కుదేలైన ఎయిర్ ఇండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలలుగా సన్నాహాల్లో ఉంది.
మొదటి దశలో భాగంగా ఆసక్తిని వ్యక్తం చేస్తూ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం విధించిన గడువు నేటి(14)తో ముగియనుంది. దీంతో పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కూడా దీని కోసం ఈవోఐను దాఖలు చేసింది. మరోవైపు ఒక ఆర్ధిక సంస్థ సహకారంతో 209 మంది ఉద్యోగులు సైతం కన్సార్షియంగా ఏర్పడి ఈవోను దాఖలు చేశారు.
ఎయిర్ ఇండియా వాటా కొనుగోలుకి టాటా గ్రూప్ డిజిన్వెస్ట్‌మెంట్ శాఖకు ఈవోఐను దాఖలు చేసింది. ఇది ఆసక్తిని వ్యక్తం చేయడం మాత్రమేనని, ఫైనాన్షియల్ బిడ్‌ను మరో రెండు వారాల్లోగా దాఖలు చేయనున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం టాటా గ్రూప్ దేశీయంగా ఎయిర్ ఏషియా, విస్తారా బ్రాండ్లతో భాగస్వామ్య సంస్థలను నిర్వహిస్తోంది. తద్వారా విమానయాన సర్వీసులను అందిస్తోంది. ఎయిర్ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలుకి సొంతంగానే ముందుకెళుతుందా, మరి ఎవరైనా భాగస్వాములను కలుపుకుని రేసులో నిలుస్తుందా అన్న అంశాలపై ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టత లేదు.
కంపెనీలో ఉన్నా 209 మంది ఉద్యోగుల తరఫున ఎయిర్ ఇండియా కొనుగోలుకి, కంపెనీ కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షి మాలిక్ కూడా ఈవోఐను దాఖలు చేశారు. ఇందుకు ఒక ఆర్థిక సంస్థ భాగస్వామిగా నిలవనున్నట్లు తెలియజేశారు. అయితే డిజిన్వెస్ట్‌మెంట్ నిబంధనల్లో భాగంగా ప్రయివేట్ సంస్థతో ఉద్యోగులు జత కట్టేందుకు వీలు లేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో నిలిచే కంపెనీ రూ. 23,286 కోట్ల రుణాలను స‍్వీకరించవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్ ఇండియాకున్న మొత్తం రూ. 60,000 కోట్ల రుణాలలో మిగిలిన వాటాను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎస్‌పీవీకు బదిలీ చేయనున్నారు. కాగా, గతంలో ప్రభుత్వం 2018లో ఒకసారి ఎయిర్ ఇండియాను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.