ఏపీ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రజల్లోకి ముందుగా వెళ్లేందుకు స్వర్ణాంధ్ర పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన పథకాలు, ప్రాజెక్టుల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తారు.
ముఖ్యంగా పెట్టుబడుల ద్వారా వచ్చిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల వివరాలను ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేయనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యూహంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర కూటమి పార్టీలు పెద్దగా స్పందించకపోవడంతో టీడీపీ స్వతంత్రంగా ముందడుగు వేస్తోంది.
రెండు సంవత్సరాలు వేచి ఉండకుండా ఇప్పుడే ప్రజల్లోకి వెళ్లడం మంచిదని చంద్రబాబు భావించారు. ఆలస్యం చేస్తే ప్రతిపక్ష వైసీపీ తాము చేసిన మంచి పనులకన్నా చెడు ప్రచారాన్ని పెంచే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేసింది.
స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఇటీవల నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని, ఇందులో విశేషంగా పాల్గొనే నాయకులకు భవిష్యత్తులో పదవులు వెతుక్కుంటూ వస్తాయని పేర్కొన్నారు.
ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతున్న స్వర్ణాంధ్ర కార్యక్రమం టీడీపీకి పునాది వేయడమే కాకుండా ప్రజల మద్దతు పెంచేలా చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.