స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతి ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా అజేయంగా ట్రోఫీని గెలుచుకోవడంతో, బోర్డు మొత్తం రూ. 58 కోట్లు ప్రైజ్ మనీగా అందించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
బీసీసీఐ ఇచ్చిన ఈ బహుమతి, ఐసీసీ ప్రకటించిన ప్రైజ్ మనీ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీ సభ్యులందరికీ ఈ మొత్తం పంచిపెట్టనున్నారు.
ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రొజర్ బిన్నీ మాట్లాడుతూ, “ఇది కేవలం టైటిల్ విజయం మాత్రమే కాదు, భారత క్రికెట్ బలాన్ని ప్రతిబింబించే ఘనత” అని పేర్కొన్నారు.
ఈ టోర్నీలో భారత్ వరుస విజయాలతో అదరగొట్టింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను ఓడించి ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయాన్ని సాధించింది. బీసీసీఐ ప్రకటించిన ఈ భారీ ప్రైజ్ మనీ భారత క్రికెట్ డామినేషన్‌ను మరోసారి రుజువు చేసింది.