హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో నిజాంసాగర్ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీ ప్రవాహాలు వస్తుండడంతో దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత బుధవారం సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ నీరంతా నిజాంసాగర్‌కు వెళ్తుండటంతో అక్కడా ప్రవాహాలు పెరిగాయి. నేడో రేపో ఆ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది.
ఇక కృష్ణా బేసిన్లో ప్రవాహ ఉధృతి కూడా ఎక్కువ గా ఉంది. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలంలోకి 3.47 లక్షలు, సాగర్‌లోకి 2.73 లక్షలు, పులిచింతలకు 4.30 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఈ నీటినంతా దిగువకు విడిచి పెడుతుండటంతో బంగాళాఖాతం వైపు వెళుతోంది.
రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులకు జలకళ వచ్చింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్లో 24,192 చెరువులు అలుగు దుంకుతున్నాయి. మరో 11,972 చెరువులు వందకు వంద శాతం నీటితో అలుగులు దుంకేందుకు సిద్ధంగా ఉన్నాయి.