తెలంగాణ: చికెన్ పకోడీ గుట్టు బయటపెట్టిన తెలంగాణ అధికారులు
సికింద్రాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన బయటపడింది. 700 కిలోల కుళ్లిన చికెన్‌ను ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చికెన్ పకోడీ తరహా స్నాక్స్, కోడిలోని వ్యర్థాలను వైనషాపులు, బార్లు, హోటళ్లకు సరఫరా చేస్తుండడం కలకలం రేపింది. బేగంపేట, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లోని ఒక చికెన్ షాప్ అక్రమంగా కోడి కాళ్లు, తలలు, స్కిన్, కొవ్వు వంటి వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచి మద్యం దుకాణాలు, బార్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఫ్రిజ్ నుంచి వెలువడిన దుర్వాసన.. గుట్టురట్టు చేసిన అధికారులు
చికెన్ షాప్‌ను ఫ్రిజ్‌లో చాలా కాలంగా నిల్వ ఉంచి విక్రయిస్తుండగా, స్థానికులకు ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుండటంతో అధికారులు ఆ దుకాణాన్ని తనిఖీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచిన చికెన్ మాసాలాలు దట్టించి వైనషాపులకు, హోటళ్లకు విక్రయిస్తున్నారని తెలిసి షాక్‌కు గురయ్యారు.
ప్రజల ఆరోగ్యం దెబ్బతీసే ప్రమాదం
కుళ్లిన చికెన్ విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యం పెనుముప్పుకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కాళ్లు, ఎముకలు, కొవ్వు వంటి వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచి, వాటిని వివిధ చోట్లకు సరఫరా చేయడం గత ఆరు నెలలుగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
దుకాణం సీజ్, సీరియస్ చర్యలు
ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆ చికెన్ షాప్‌ను అధికారులు సీజ్ చేశారు. గోదాంలో నిల్వ ఉంచిన కోడి వ్యర్థాలు ఎంత ప్రమాదకరమో తెలుసుకున్న తర్వాత, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.