తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చుట్టూ ఉత్కంఠ నెలకొంది. కిషన్ రెడ్డి స్వయంగా తనను పదవి నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరడంతో, కొత్త నేతకు పగ్గాలు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
బీజేపీ ఈసారి బీసీ నేతకే అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ బీసీ నేతను పీసీసీ చీఫ్‌గా నియమించిన నేపథ్యంలో, బీజేపీ కూడా ఇదే మార్గాన్ని అనుసరించవచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు, సీనియర్ నేత ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవికి బలమైన ఆశావాహిగా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఉన్న అనుభవం వల్ల రాష్ట్రంపై పట్టు ఉన్న నేతగా గుర్తింపు పొందిన ఈటలకి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తన పేరును పోటీగా ముందుకు తెచ్చుకోవడం ఆసక్తి రేపుతోంది. దేశభక్తి మరియు దూకుడు నాయకత్వం కావాలంటూ ఆయనకు మద్దతు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు రాజాసింగ్, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ వంటి పలువురు కీలక నేతలు ఈ రేసులో ఉన్నారు.
ఈనెలాఖరులోగా కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం తెలంగాణ బీజేపీ భవిష్యత్తు ఎన్నికల ప్రణాళికపై పెద్ద ప్రభావం చూపనుంది.