హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 15 సోమవారం ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం మొదలుపెట్టారు. గవర్నర్ అందరికీ నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.
ఆమె ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఆరు దశాబ్దాల తరువాత ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. కఠిన సవాళ్లను ఎన్నో ఎదుర్కొని నిలబడిన తెలంగాణ అనేక మైలురాళ్లను అధిగమించింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎన్నో అపోహాలు సృష్టించారు. కానీ నేడు అభివృద్ధికి తెలంగాణ నిదర్శనంగా నిలిచింది. గతంలో విమర్శలు చేసిన వారి నోళ్లు మూతపడ్డాయి. తెలంగాణ ప్రగతి చూసి దేశం ఆశ్చర్యపోయింది. సంక్షేమానికి తెలంగాణ పెద్దపీట వేస్తోంది అని తెలిపింది.
అలాగే మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయని, రైతు బంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. రైతు బీమాతో అన్నదాతలకు అండగా నిలిచాం. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది. సమృద్ధి పంటలతో తెలంగాణ ధాన్యాగారంగా మారింది. పత్తి ఉత్పత్తిలో దేశంలోనే తెంగాణ రెండో స్థానంలో ఉంది.
ఆర్థిక పరమైన అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా క్రమశిక్షణతో వ్యవహరిస్తోందని ప్రశంసించారు. పెన్షన్ల కోసం ప్రతి ఏటా రూ. 8710 కోట్లు కేటాయింపు జరుగుతోంది. త్వరలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి. సోలార్ పవర్ రంగంలోనూ అభివృద్ధి సాధించాం’ అంటూ ప్రసంగించారు.
తొలి రోజు సమావేశాలు కాగా గవర్నర్ ప్రసంగంతో ముగియనున్నాయి. ఈ నెల 18న తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 12 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని తెలిసింది.