హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దానితో పాటుగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను రద్దు చేస్తూ, ఇంటర్ రెండవ సంవత్సర పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో నెలకొన్న కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రద్దైన సంగతి విదితమే. ఇదే క్రమంలో వైరస్ తీవ్రత నెలకొన్నందున రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. రాష్ట్రంలో దాదాపు 5.35లక్షల మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నారు.
పరీక్ష రద్దు వల్ల వీరందరినీ తదుపరి తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయానికి సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఫైల్‌పై ఇప్పటికే ముఖ్యమంత్రి సంతకం కూడా చేసినట్లు సమాచారం. ఇక కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు కూడా ఈపాటికే మూతపడిన విషయం తెలిసిందే.