తెలంగాణ: కేబినెట్ విస్తరణ – రేవంత్ రెడ్డి దిల్లీ పయనం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులోపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ వివరాల ప్రకారం, ఈ నెల 17వ తేదీన జరిగే సీడబ్ల్యుసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హాజరుకానుండగా, ఈ సమావేశం తరువాత మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చ జరగనుంది. ఏఐసీసీ ఈ విస్తరణ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో మంత్రివర్గ విస్తరణపై పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ, ఏకాభిప్రాయం రాకపోవడంతో కేబినెట్ విస్తరణలో జాప్యం చోటుచేసుకుంది.
కేబినెట్‌లో కొత్తగా నలుగురికి అవకాశం:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నాయకత్వం కేబినెట్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు మంత్రి పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్‌లో 12 మంది మంత్రులుండగా, కొత్తగా నలుగురికి అవకాశం దక్కనుంది. సామాజిక సమీకరణాలను బట్టి, కేబినెట్ విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసీసీ మధ్య చర్చలు జరగనున్నాయి.
డిల్లీ పయనం:
ఈనెల 17న జరగబోయే సీడబ్ల్యుసీ సమావేశానికి రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. సీడబ్ల్యూసీ సభ్యులైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి కూడా సమావేశానికి హాజరుకానున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఇటీవల జరిగిన హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై చర్చ జరగనుంది. అదేవిధంగా మహారాష్ట్ర, ఝార్ఘండ్ ఎన్నికలకు వ్యూహాలను కూడా చర్చించనున్నారు. ఈ సమావేశం కోసం సీఎం రేవంత్ రెడ్డి 16న రాత్రి లేదా 17వ తేదీ ఉదయం దిల్లీ పయనం కానున్నారు.