తెలంగాణ: కాంగ్రెస్‌లో మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం పట్టాలెక్కే సూచనలు కనిపించటం లేదు. నెలలుగా చర్చలో ఉన్న ఈ విస్తరణ పై ఇంకా నిర్ణయం రాకపోవడంతో ఆశావహుల్లో నిరాశ నెలకొంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పై కొందరు అసంతృప్తితో ఉన్నారు.
సుమారు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు దక్కుతాయని తొలుత ఊహించినా, కార్యచరణలో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఇదే సమయంలో మాజీ మంత్రి ఒకరు తన కుమారుడికి మంత్రి పదవి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఇతర నేతలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. పైగా, రేవంత్ రెడ్డి తన స్నేహిత వర్గానికి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన కొత్త నేతలు కూడా ఈ రేసులో ఉన్నారని, ఈ కారణంగానే జీవన్ రెడ్డి ఫిరాయింపులపై వ్యాఖ్యలు చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల తర్వాత మాత్రమే ఈ వివాదంపై అధిష్టానం ఒక స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సవాళ్లను అధిగమించి మంత్రి వర్గ విస్తరణ పూర్తవుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.