హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల చిట్టా పెరిగుతూ పోతోంది. ద్రవ్య నియంత్రణ, నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులకు లోబడే ప్రభుత్వం ప్రతి యేటా తెస్తున్న అప్పులు మొత్తం కలిపి దాదాపు ఒక ఏడాది బడ్జెట్‌ను దాటిపోయాయి.
కాగా ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.2.30 లక్షల కోట్లుగా ఉండగా మొత్తం అప్పులు రూ.2.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2020–21 ఏడాదికి గాను సవరించిన అంచనాల ప్రకారం అప్పులు రూ.2.45 లక్షల కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది మరో 41 వేల కోట్ల వరకు పెరగనుంది.
రాష్ట్రంలో 2011 సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం చూస్తే, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై దాదాపుగా రూ.81,395 వరకు అప్పు ఉన్నట్లు లెక్క. గత ఏడాది తలసరి అప్పు రూ.65,480 కాగా అది ఇప్పుడు మరో రూ.16 వేలు పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం రుణాలను ఎక్కువగా బహిరంగ మార్కెట్ ద్వారానే సేకరిస్తోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్ రుణాల చిట్టా రూ.2.44 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 7,852 కోట్లు, స్వయంప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 14,860 కోట్లు, బాండ్ల రూపంలో రూ.19,552 కోట్లు రుణాల రూపంలో సమీకరణ చేసినట్టు బడ్జెట్ గణాంకాలు చెపుతున్నాయి.