హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ మూలవేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసు చేసింది. 2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిటీ సూచించింది. కాగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగించాలంటూ మరో కీలక సిఫారసును కూడా కమిటీ చేసింది. ఈ మేరకు చిత్తరంజన్ బిస్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి పీఆర్‌సీ గత డిసెంబర్ 31న సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బయట పెట్టింది.
తెలంగాణ లో ఉద్యోగుల కనీస వేతనాన్ని ఇప్పుడున్న నెలకు రూ.13,825 నుంచి రూ.19 వేల రూపాయలకు పెంచాల్సిందిగా కమిషన్ తొలుత నిర్ణయం తీసుకుంది. దీని ప్రాతిపదికగా ఫిట్‌మెంట్ శాతాన్ని ఖరారు చేసింది. ప్రస్తుత కనీస వేతనం రూ.13,825కు 2018 జూలై 1 నాటికి ఉన్న 33.399 శాతం డీఏ కలిపిన తర్వాత 7.5 శాతం ఫిట్‌మెంట్ జోడిస్తే (రూ.13,825+33.399% డీఏ+7.5% ఫిట్‌మెంట్) కనీస వేతనం రూ.19 వేలకు పెరుగుతుంది. అందుకే 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ జరపాలని సిఫారసు చేస్తున్నట్టు కమిషన్ వివరణ ఇచ్చింది.
7వ కేంద్ర వేతనాల కమిషన్ (సీపీసీ) హెచ్‌ఆర్‌ఏ శ్లాబు రేట్లను 30 శాతం, 20 శాతం, 10 శాతం నుంచి వరుసగా 24 శాతం, 16 శాతం, 8 శాతానికి తగ్గిస్తూ సిఫారసులు చేసిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్ రేట్లను సైతం తగ్గించాలి. వారి మూల వేతనంపై 30, 20, 14.5, 12 శాతాల నుంచి వరుసగా 24, 17, 13, 11 శాతాలకు తగ్గించాలి. కనీస వేతనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.18 వేల మాత్రమే ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.19 వేలు సిఫారసు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో హెచ్‌ఆర్‌ఏ ఖరారు చేసే అంశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్పంగా లబ్ధి చేకూరుతుంది అని తెలిపింది.
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువులకు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున గరిష్టంగా ఇద్దరు పిల్లల ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించే ఉద్యోగుల పిల్లల ఫీజులను ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఇద్దరు పిల్లలకు చెల్లించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.