హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్డౌన్ ను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ను మరో పదిరోజుల పాటు పొడిగించింది. ఈ విషయమై ఈ రోజు జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశం తరువాత లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం మరింత సడలించింది. రేపటి నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ను సడలించింది. తరువాత ఒక గంట అంటే 6 గంటల వరకు ప్రజలకు ఇళ్లకు వెళ్లేందుకు గంట పాటు వెసులుబాటును కల్పించింది.
కాగా ఇక సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరక ఖచ్చితమైన లాక్డౌన్ మాత్రం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా అదుపులోకి రాని నియోజకవర్గాల్లో ప్రస్తుత లాక్డౌన్ ను అలానే కొనసాగిస్తుంది. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడలో ప్రస్తుత లాక్డౌన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.