హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా మొత్తం రాష్టవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స మరియు కోవిడ్ టెస్ట్ ధరలను ఇవాళ ఖరారు చేసింది. ఈ మేరకు కరోనా చికిత్సల ఛార్జీలపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రత్యేక జీవో 40ని జారీ చేసింది.
కోవిడ్ మహమ్మారి బారిన పడి సాధారణ వార్డులో ఐసోలేషన్ మరియు పరీక్షలకు గాను రోజుకు గరిష్టంగా రూ.4 వేలు, అదే ఐసీయూ గదిలో చేరితే ఒక రోజుకు గరిష్టంగా రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ.9 వేలు, పీపీఈ కిట్ ధర రూ.273కి ఏ మాత్రం మించరాదని ఆస్పత్రులకు ఛార్జిలను ఖారారు చేసింది.
కాగా హెచ్‌ఆర్ సీటీ రూ.1995, డిజిటల్ ఎక్స్ రే రూ.1300, ఐఎల్6 లకు కేవల రూ.1300 మాత్రమే ఛార్జ్ చేయాలని పేర్కొంది. అదే విధంగా డీ డైమర్ రూ.300, సీఆర్‌పీ రూ.500, ప్రొకాల్ సీతోసిన్ రూ.1400, ఫెరిటీన్ రూ.400, ఎల్‌డీహెచ్ రూ.140 ఛార్జీలను నిర్ణయించింది.
సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలుగా, ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.125, కనీసం రూ.3వేలుగా ధరలను ప్రభుత్వం ఖారారు చేసింది.