తెలంగాణ రాష్ట్ర క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లలో సిరాజ్ తనదైన శైలిలో అదరగొడుతుంటాడు. అతని స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం అతడికి ప్రత్యేక గౌరవాన్ని అందజేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, డీఎస్పీ స్థాయి ఉద్యోగం కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా, తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ సిరాజ్‌కు డిప్యూటీ సూపరిండెంటెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పదవి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సిరాజ్ తెలంగాణ ప్రభుత్వానికి మరియు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం, సిరాజ్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం సిరాజ్‌ను ఘనంగా సన్మానించారు మరియు సిరాజ్ క్రికెట్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవడంపై ప్రశంసలు అందించారు.