తెలంగాణ: ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శలతో ముందుకు వస్తున్నారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నప్పటికీ, ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తోందని అన్నారు.
అనేక సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోలో లేకున్నా ప్రజలకు అవసరమైన హామీలను కూడా అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
తెలంగాణలో కులగణన చేపట్టాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, కానీ బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమాన్ని కూడా విమర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
వెనుకబడిన కులాల సంక్షేమంపై బీఆర్ఎస్‌కి ఏమాత్రం ప్రేమ లేదని కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిలో బలహీన వర్గాలకు చెందిన నాయకుడే ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజల శ్రేయస్సే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని, వామపక్ష పార్టీలు కూడా తమ వైపు ఉండి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ విమర్శల నేపధ్యంలో కూడా ప్రభుత్వం తగిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కొనసాగిస్తుందన్నారు.