హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఇంకో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే లాక్‌డౌన్ మినహాయింపు సమయాన్ని కూడా పెంచింది. దీనికి సంబంధించి ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు.
చాలా సేపు జరిగిన ఈ భేటీలో లాక్‌డౌన్‌తోపాటు పలు ఇతర అంశాలపైనా కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసారు. ఇప్పుడు ఉన్న ఉదయం 6 నుంచి పది గంటల వరకు మినహాయింపు ఉండగా, ప్రస్తుతం దీనిని మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొడిగించారు. జనం ఇళ్లకు తిరిగి చేరుకునేందుకు మరో గంట సమయం ఇచ్చారు. కాబట్టి అంతా 2 గంటలకల్లా తమ గమ్యస్థానాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి జరుగుతున్న తీరు, దాని నియంత్రణ మరియు బాధితులకు అందుతున్న వైద్యం, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రివర్గంలో దీనిపై సుధీర్ఘంగా చర్చించింది. కరోనా వ్యాప్తి తగ్గుతోందని ఉన్నతాధికారులు వివరించగా, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, అలంపూర్, గద్వాల, నారాయణపేట్, మక్తల్, నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్‌నగర్ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి పర్యటించాలని కేబినెట్ సూచించింది.
రాష్ట్రంలో సెకండ్ వేవ్ తగ్గుతున్నట్టు వార్తలు వస్తున్నా, థర్డ్ వేవ్ విరుచుకుపడే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది. మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేలా ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోవాలని కోరింది. రాష్ట్రంలోని అన్ని ఏరియా, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో పరిస్థితులను సమీక్షించి, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.