తెలంగాణ: ఏపీకి ఇవ్వడం సంతోషమే… కానీ తెలంగాణకు ఏమీ ఇచ్చారో చెప్పాలని నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు
ఏపీలో పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆంధ్రప్రదేశ్ రాజధానికి డబ్బులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావు, ఈ బడ్జెట్‌ను చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు.
ఈ బడ్జెట్‌లో “తెలంగాణ” అనే పదమే ఉచ్చరించలేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పేరును అనేకసార్లు ప్రస్తావించారని, కానీ తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టారని ఆయన విమర్శించారు.
హరీశ్ రావు మీడియా పాయింట్ వద్ద, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. “ఏపీలో పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పడం, ఏపీ రాజధానికి డబ్బులు ఇస్తామని చెప్పడం, రాయలసీమతో పాటు ఆంధ్రాలోని వెనుకబడిన జిల్లాలకు ఫండ్స్ కేటాయించడం సంతోషమే.
కానీ, తెలంగాణ విషయంలో ఏం చేస్తున్నారో చెప్పాలి” అని అన్నారు.
అలాగే, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటెన్ చేస్తున్నామని, ప్రధాన మంత్రి మోదీకి దగ్గరగా ఉన్నామని, కేంద్రమంత్రులను రోజూ కలుస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ నిధుల కేటాయింపుపై ఏం మాట్లాడుతారో చెప్పాలని ప్రశ్నించారు.
“కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేకపోవడం దురదృష్టకరం.
బీజేపీ మరియు కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి” అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.