హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల పలు జిల్లాల్లో ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి, చెరువులు అలుగులు పారుతున్నాయి. రోడ్లు దెబ్బతినడం, జలదిగ్బంధంతో పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో అత్యధికంగా 22.06 సెం.మీ. వర్షం కురిసింది.
వేలాది ఎకరాల్లో పత్తి, వరి, కంది పంటలు నీటమునిగాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోగోడ కూలి ముగ్గురు, హైదరాబాద్ పీర్జాదిగూడలో ఆలయ ప్రహరీ కూలి ఇద్దరు మృతిచెందారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో దిగువన ఉన్న కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకు పోయాయి. గ్రామాల చుట్టూ వరద చేరడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.
బుధవారం మద్నూర్ మండలంలోని ఎన్ బుర, కుర్లా, దోతి, గోజేగావ్, సిర్‌పూర్, ఇలేగావ్ గ్రామాల చూట్టు వరద నీరు చేరిందని గ్రామస్తులు తెలిపారు. వరద నీరు ఇంట్లోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు గ్రామాల్లోని సిబ్బందితో ఫోన్ లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బిచ్కుంద మండలంలోని మెక్క, మిషన్ కల్లాలి, ఖద్గాం గ్రామాల చుట్టూ వరద నీరు చేరడంతో జలదిబ్బంధంలో ఉన్నాయి.
అంతేగాకుండా శెట్లూర్, నాగుల్‌గావ్, లొంగన్, రాజుల్లా తదితర గ్రామాల్లోని పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. భారీ వర్షాలతో మంజీర పరీవాహక ప్రాంతాలైన మదన్ హిప్పర్గా, కుర్లా, ఎన్ బుర, ఇలేగావ్, సిర్‌పూర్ గ్రామ శివారులోని సుమారు వెయ్యి ఎకరాల వరి పంట పూర్తిగా నీట మునిగిందని రైతులు పేర్కొన్నారు. మర్పల్లి లో వరదనీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను కాపాడబోయి ఓ తల్లి మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని శాపూర్‌లో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన నెనావత్ దశరథ్, భార్య అనిత.. తమ ముగ్గురు పిల్లలతో పాటు మరో 5 మంది కూలీలతో పత్తి పంటలో కలుపు తీసేందుకు వెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. ఆటోలు ఇంటి వచ్చే దారిలో శాపూర్‌తండా సమీపంలో ఉన్న కల్వర్టుపై నుంచి భారీ వరద పారుతోంది. దశరథ్, అనిత(42)తో పాటు ముగ్గురు పిల్లలను పట్టుకుని కల్వర్టు దాటే ప్రయత్నం చేశారు.
ఇద్దరు పిల్లలు వారి చేతుల నుంచి తప్పి వరదలో కొట్టుకుపోతున్నారు. ఇది చూసిన అనిత పిల్లలను కాపాడేందుకు వరద నీటిలో వెంబడించింది. కొద్ది దూరం వరకు వెళ్లిన పిల్లలు ఓ చెట్టు కొమ్మలను పట్టుకొని అక్కడే నిలిచారు. అనిత మాత్రం వరద ఉధృతిలో అర కిలోమీటరు దూరం కొట్టుకుపోయి ప్రాణాలు విడిచింది.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు మత్తడి నీటి ప్రవాహంలో రెండు మోటార్ సైకిళ్లు కొట్టుకుపోయాయి. వాటిపై ఉన్న గంధమల్ల చెందిన శాగర్ల మధు, బొత్త మహేశ్, శాగర్ల వెంకటేశ్‌లను స్థానికులు రక్షించారు. ముగ్గురు యువకులు రెండు బైక్‌లపై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్, మహేశ్‌కు స్వల్పగాయలయ్యాయి.