హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కరోనా విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టుకు తమ నివేదికను సమర్పించింది. ఎక్కడ కేసులు ఎక్కువ ఉంటే వాటిని మైక్రో కంటోన్మెంట్ జోన్స్ కింద ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
తెలంగాణకు వచ్చే ఇతర రాష్ట్ర ప్రతి ప్రయాణికుడి నుంచి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ తీసుకోవాలని హైకోర్టు ఇవాళ స్పష్టం చేసింది. ఫంక్షన్ హాల్స్, మ్యారేజ్ హాల్స్ వద్ద ఎక్కువమంది గుమికూడితే అలాంటి వారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. కరోనా వ్యాక్సిన్ ఎంత మోతాదులో వచ్చింది? ఎంత వేస్టేజ్ అయిందో చెప్పాలని హైకోర్టు పేర్కొంది. వీటన్నిటి మీద పూర్తి వివరాలతో మళ్లీ నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.