హైదరాబాద్ : తెలంగాణ సర్కారుపై హైకోర్టు కరోనా పరీక్షల విషయంలో మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సఖ్య విషయంలో ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వైరస్ పరీక్షలపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమలు చేయడం లేదని మండిపడింది.
కేవలం అవసరం ఉన్నప్పుడే ప్రభుత్వం రోజుకు 50వేల పరీక్షలు చేస్తామని నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. యశోద, కిమ్స్, కేర్, సన్ షైన్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనింది హైకోర్టు.
స్థానిక ఎన్నికల ఫలితాలేమో కానీ, ఎన్నికలయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు వస్తాయని చురకలంటించింది. రెండో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అనిపించడం లేదని మొట్టికాయ వేసింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
ఈ క్రమంలో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు హైకోర్టు, కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని శ్రీనివాస్ రావును హైకోర్టు ఆదేశించింది. రోజుకు 50వేలు, వారానికోసారి లక్ష కరోనా పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు 50 వేల పరీక్షలు అవసరం ఉన్నప్పుడు చేస్తామని శ్రీనివాస రావు నివేదికలో పేర్కొనగా.. రోజుకు 50 వేలు, వారానికో రోజు లక్ష కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశించింది.