హైదరాబాద్: దేశంలో గత రెండు రోజులుగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇది టెస్ట్ల సంఖ్య తగ్గడం వల్ల అయ్యుండొచ్చని నిపుణుల అభిప్రాయం. ఇక తెలంగాణ సంగతికొస్తే కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను మే 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
ఈ రోజు సీఎం కేబినెట్ లోని మంత్రులందరితో ఫోన్లో మాట్లాడి వారందరి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.
దీనికి సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా వున్నందున ఈ నెల 20 వ తేదీన జరప నిర్ణయించిన క్యాబినెట్ మీటింగును సీఎం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.