హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్, ఆరోగ్య, సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఈ కార్డులను రూపొందించి, లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. వన్ స్టేట్ – వన్ డిజిటల్ కార్డ్ విధానంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం రేవంత్ సూచించారు.
సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ*తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో డిజిటల్ కార్డులపై చర్చించారు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుండి విడుదలైన ప్రకటన ప్రకారం, *ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అర్హులందరికీ సంక్షేమ పథకాలు సులభంగా అందేలా ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు:
ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి, డిజిటల్ కార్డుల అమలును ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ డిజిటల్ కార్డుల్లో ప్రతి కుటుంబ సభ్యుడి ఆరోగ్య ప్రొఫైల్ సమగ్రంగా నమోదు చేయాలన్నారు. కుటుంబంలో కొత్త సభ్యుల చేరిక లేదా తొలగింపులకు సంబంధించి, కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకునే విధంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రాల అధ్యయనం:
రాష్ట్రంలో అమలుకు ముందు, ఇప్పటికే కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో అమలులో ఉన్న డిజిటల్ కార్డు వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేసి, నివేదిక రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
సమావేశంలో పాల్గొన్న వారు:
ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, సంగీత సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.