హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పును వెల్లడించింది.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై దాఖలైన అనర్హత పిటీషన్ల విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, ఈ విషయంలో కాలపరిమితి విధించడం సాధ్యపడదని కోర్టు స్పష్టం చేసింది.
తాజా తీర్పు ప్రకారం, 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ మార్పులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ తీర్పుతో తాత్కాలికంగా కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఊరట పొందినట్లు కనిపిస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.
ఈ చర్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి వివేకానంద్, అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనర్హత పిటీషన్లు దాఖలు చేశారు.
అయితే హైకోర్టు ముందుగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేసారు, దాంతో డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది.
తాజా తీర్పు ప్రకారం, ఐదేళ్ల అసెంబ్లీ గడువు దృష్టిలో ఉంచుకుని స్పీకర్ బాధ్యతాయుత నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. తెలంగాణ రాజకీయాల్లో ఈ తీర్పు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉండగా, స్పీకర్ తీసుకునే తుది నిర్ణయం కీలకంగా మారింది.