తెలంగాణ: రాష్ట్రం వరిసాగు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ వానాకాలం సీజన్‌లో పంజాబ్‌ను అధిగమించి చరిత్ర సృష్టించింది. 66.77 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు జరగడం, 153 లక్షల టన్నుల రికార్డు స్థాయి ధాన్యం ఉత్పత్తి జరగడం రాష్ట్ర రైతుల శ్రమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరగడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కారణం అన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రచారం అవాస్తవం.
కాళేశ్వరంలో మేడిగడ్డ పనితీరు తగ్గిపోయినా, నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన యాజమాన్య వ్యవస్థలు లేకపోయినా, ఈ ఫలితాలు తెలంగాణ రైతుల కృషి వల్ల సాధ్యమయ్యాయి. కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఈ విజయం తెలంగాణ రైతుల కష్టానికి తార్కాణం” అని రేవంత్ పేర్కొన్నారు.
అలాగే, “తెలంగాణ రైతులు దేశానికి గర్వకారణం. వారే ఈ రికార్డు స్థాయి వరిధాన్యాన్ని ఉత్పత్తి చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు. ప్రతి రైతు సోదరుడికి నా హృదయపూర్వక అభినందనలు” అంటూ రైతులను అభినందించారు.
తెలంగాణ రైతుల శ్రమతో ఉత్పత్తి అయిన ఈ రికార్డు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.