హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టీకాలు జాతీయ స్థాయి సగటును మించి జరిగిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ వారం బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండవ డోస్ వేసినట్లు తెలిపారు.
భారత దేశ జాతీయ స్థాయిలో మొదటి డోస్ 79 శాతం మందికి రెండవ డోస్ 37.5 శాతం వరకు నమోదయిందని వివరించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీ హెచ్చార్డీలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల పరిస్థితులు, టీకాలు, కొత్త వైద్య కళాశాలలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై హరీశ్‌రావు చర్చించారు.
నూతన ఆస్పత్రి కి సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, అలానే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని కూడా మరింత పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ వేగం పెంచడంలో భాగంగా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు.