fbpx
Thursday, November 21, 2024
HomeTelanganaదేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర: రక్షణ మంత్రి

దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర: రక్షణ మంత్రి

Telangana’s key role in national development Defense Minister

తెలంగాణ: దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర: రక్షణ మంత్రి

వికారాబాద్‌ జిల్లాలోని దామగూడం వద్ద నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. రాడార్‌ ప్రాజెక్టు శంకుస్థాపన అనంతరం, వీఎల్‌ఎఫ్‌ కేంద్ర నమూనాను పరిశీలించారు.

ఈ రాడార్‌ ప్రాజెక్టు శత్రు దేశాలపై నిఘా ఉంచేందుకు కీలకంగా ఉండనుంది. దామగుండం వద్ద అనువైన స్థలం ఉండటంతో రక్షణ శాఖ ఈ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాలను అటవీ అధికారులు ఈ ఏడాది జనవరిలో నౌకాదళానికి అప్పగించడంతో, ప్రాజెక్టుకు అవసరమైన భూములు లభ్యమయ్యాయి. దామగుండం ప్రాజెక్టు 2027 వరకు పూర్తవుతుందని అంచనా.

వృద్ధి చెందుతున్న టౌన్‌షిప్‌
రాడార్‌ స్టేషన్‌ సమీపంలో అన్ని సౌకర్యాలతో కూడిన టౌన్‌షిప్‌ నిర్మాణం జరగనుంది. ఇక్కడ పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లు, బ్యాంకులు వంటి సదుపాయాలు లభ్యం కానున్నాయి. దాదాపు 3 వేలమంది ఈ టౌన్‌షిప్‌లో నివసించనున్నారు. ప్రాజెక్టు చుట్టూ 27 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కూడా జరగనుంది.

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రాముఖ్యత
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, దేశ రక్షణలో తెలంగాణ మరొక అడుగు ముందుకేసిందన్నారు. హైదరాబాదును సాంకేతిక లోకేషన్‌గా అభివృద్ధి చేయడంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని వీఎల్ఎఫ్‌ స్టేషన్‌తో పోల్చుతూ, ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. దేవాలయాల పట్ల ప్రజల భావజాలాన్ని గౌరవిస్తూ, స్థానికులకు ఆలయ దర్శన సౌకర్యం అందుబాటులో ఉండాలని సూచించారు.

2015లో దీనికి సంభందించిన భూకేటాయింపులు తదితర నిర్ణయాలు గత ప్రభుత్వ హయంలో జరిగాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడగగానే దేశ భద్రతకు సంబంధించిన అంశంలో కచ్చితంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. మీరు వేరే పార్టీకి చెందిన వారు, నేను వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అయినప్పటికీ దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పురాతన దేవాలయానికి వచ్చే స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడండి ఇది సెంట్‌మెంట్‌తో కూడుకున్న అంశం.” – రేవంత్ రెడ్డి, సీఎం

రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందనలు
వీఎల్ఎఫ్‌ స్టేషన్‌ శంకుస్థాపన అబ్దుల్‌ కలాం జయంతి రోజున జరగడం సంతోషకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సహకారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ, కమ్యూనికేషన్ రంగంలో సాంకేతికతతో తెలంగాణ ముందుకు సాగుతుందని కొనియాడారు.

తెలంగాణ భవిష్యత్‌కు కీలకం
రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ, కమ్యూనికేషన్ రంగంలో వీఎల్ఎఫ్‌ స్టేషన్‌ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. సాంకేతికత ద్వారా రక్షణ వ్యవస్థ మరింత మెరుగవుతుందని, ఓడలు, సబ్‌మెరైన్లకు సమాచారాన్ని త్వరగా చేరవేయడం ద్వారా దేశ రక్షణను బలోపేతం చేయవచ్చని వివరించారు.

“దేశరక్షణ విషయంలో వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌ అనేక విధాలుగా ప్రయోజకరం. కమ్యూనికేషన్‌ విషయంలో భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలి. సాంకేతిక యుగంలో కమ్యూనికేషన్‌ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ రంగంలో పావురాలు, గుర్రాల నుంచి ఇక్కడి వరకు వచ్చాం. తపాలా వ్యవస్థను అనేక ఏళ్లుగా వినియోగించుకున్నాం. ఇప్పుడంతా ఇంటర్నెట్‌ యుగం సమాచారం క్షణాల్లో చేరుతోంది. విద్య, వైద్య రంగాల్లో సమాచార విప్లవం కీలకపాత్ర పోషిస్తోంది. ఇంట్లో కూర్చునే అనేక కోర్సులు నేర్చుకునే అవకాశం వచ్చింది. ఓడలు, సబ్‌మెరైన్లకు సమాచారం ఇవ్వడంలో వీఎల్‌ఎఫ్‌ది ప్రముఖపాత్ర.” – రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ శాఖ మంత్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular