న్యూఢిల్లీ: దేశంలో 5 ఏళ్ల తర్వాత జరిగిన టెలికాం స్పెక్ట్రమ్ వేలం ఈ రోజు ముగిసింది. ఈ స్పెక్ట్రమ్ వేలానికి మొత్తం రూ.77,814.80 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం ఆరు బిడ్డింగ్ రౌండ్లు ముగిసిన తర్వాత రిలయన్స్ జియో అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచింది.
ఈ స్పెక్ట్రం వేలంలో అత్యధికంగా రిలయన్స్ జియో రూ.57,122 కోట్ల బిడ్లను దాఖలు చేసింది. కాగా, రిలయన్స్ జియో ప్రధాన పోటీదారైన ఎయిర్‌టెల్ రూ.18వేల 669 కోట్లకు మాత్రమే బిడ్ వేస్తే వొడాఫోన్-ఐడియా కేవలం రూ.1993 కోట్లకు మాత్రమే బిడ్స్ దాఖలు చేసింది. తాజా స్పెక్ట్రం వేలం ద్వారా 855.60 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంకు ప్రభుత్వం మొత్తం 77,814.80 కోట్లు సంపాదించింది.
2021 స్పెక్ట్రం వేలంలో కేవలం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా మాత్రమే బిడ్డర్లుగా నిలిచాయి. ముగిసిన స్పెక్ట్రం వేలంలో దేశవ్యాప్తంగా 22 సర్కిల్‌లలో స్పెక్ట్రం వాడే హక్కును సొంతం చేసుకున్నట్లు రిలయన్స్ జియో ప్రత్యేక ప్రకటనలో తెలిపింది. కొనుగోలు చేసిన స్పెక్ట్రం 5జీ సేవల కోసం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ స్పెక్ట్రం వేలం ప్రత్యేకంగా 4జీ బ్యాండ్ల కోసం జరిగింది. సబ్ గిగా హెర్జ్ట్ కేటగిరీలో 355.45 మెగా హెర్ట్జ్ మిడ్ బ్యాండ్, 2300 మెగాహెర్జ్ట్ బ్యాండ్ స్పెక్ట్రమ్ సొంతం చేసుకున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. భవిష్యత్తులో 5జీ సేవల కోసం తాజా స్పెక్ట్రమ్ దోహదపడుతుందని తెలిపింది. కొత్తగా 9 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ను చేర్చుకున్నట్లు పేర్కొంది. అలాగే ప్రతి పట్టణ ప్రాంతానికి తమ నెట్‌వర్క్ అందించే అవకాశం లభించినట్లు తెలిపింది.