సియోల్: ఇప్పటికే ఎలన్ మస్క్ కు చెందిన కంపెనీ అయిన టెస్లా విద్యుత్ వాహనాల ఉత్పత్తిలో ఒక సంచలనాన్ని సృష్టించింది. టెస్లా కంపెనీ తాజాగా సైబర్ ట్రక్ వాహనాలను కూడా త్వరలో ఉత్పత్తి చేయబోతోంది. అయితే తాజాగా టెస్లా, శాంసంగ్ తో ఒక కీలకమైన ఒప్పందాన్ని కుదిర్చుకుంది.
టెస్లా తయారు చేయబోయే ఈ సైబర్ ట్రక్ వాహనాల్లో అమర్చబోయే కెమెరా మాడ్యూళ్ల కోసం శాంసంగ్ ఎలక్ట్రానిక్ కంపెనీతో సుమారు రూ. 3000 కోట్లతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. టెస్లా కార్ల సంస్థకు కెమెరా మాడ్యూళ్లను సరఫరా చేసేందుకు తమతో డీల్ కుదిరిందని శాంసంగ్ కంపెనీ కూడా ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా శాంసంగ్ మరియు టెస్లాల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడే తొలిసారి కాదు. క్రితంలో కూడా టెస్లా కంపెనీకు ఎలక్ట్రిక్ వాహానాలలో ఉపయోగించే బ్యాటరీలను సరఫరా చేయడంలో శాంసంగ్ పాత్ర ఉంది.
అలాగే శాంసంగ్ కంపెనీ తయారుచేసిన పిక్సెల్ ఎల్‌ఈడీ ల్యాంప్‌లను టెస్లా తయారు చేస్తున్న విద్యుత్తు వాహనాల్లో వినియోగించనుంది. అయితే టెస్ల తయారు చేయబోయే సైబర్‌ట్రక్ వాహానాల కోసం ఇప్పటికే పది లక్షల మంది తమ పేరును ముందస్తు నమోదు చేసుకున్నారని సదరు కంపెనీ ప్రకటించింది.