న్యూఢిల్లీ: యూఎస్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహన రంగ దిగ్గజం అయిన టెస్లా ఎట్టకేలకు భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. టెస్లా కంపెనీ కార్లు 2021 ప్రథమార్ధంలోనే మన రోడ్లపై పరుగులు తీయబోతున్నాయి. ఇప్పటికే వచ్చే ఏడాది భారత్‌లో తాము ప్రవేశించనున్నట్టు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అక్టోబరు 2న టెస్లా క్లబ్ ఇండియా ట్వీట్‌కు సమాధానంగా వెల్లడించారు.
వాస్తవానికి టెస్లా 2016లోనే భారత్‌కు రావాలని భావించి బుకింగ్స్ కూడా స్వీకరించింది. ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ, ఈ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కంపెనీ తన ఆలోచనను అప్పట్లో విరమించుకుంది. అయితే నాలుగేళ్ల క్రితం బుక్ చేసుకున్న వారికి కంపెనీ ఇప్పుడు తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది.
అయితే కంపెనీ మాత్రం ఒకట్రెండేళ్ల వరకు డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని నిర్ణయించింది. కేవలం ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా మాత్రమే కార్యకలాపాలను నిర్వహించనుందని సమాచారం. అదే విధంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా టెస్లా ఆసక్తి చూపుతోంది. తయారీ లేదా అసెంబ్లింగ్ ప్లాంటుతోపాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రం నెలకొల్పాలని భావిస్తోంది. ఈ విషయాలను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ధ్రువీకరించారు.
భారత్ లో టెస్లా కంపెనీ ముందుగా తమ మోడల్–3 లగ్జరీ కారును ప్రవేశపెట్టనుంది. ఈ కార్ల కోసం జనవరిలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. పూర్తిగా తయారైన కారును ఇక్కడికి దిగుమతి చేయనున్నారు. కారు ధర రూ.55–60 లక్షలు ఉండనుంది. డెలివరీలు మార్చి చివరి నుంచి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కంపెనీ తయారు చేసే కార్లలో ఇదే చవకైనది. ఒకసారి చార్జీ చేస్తే 381 నుంచి 580 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలిపింది.