fbpx
Monday, December 23, 2024
HomeAndhra Pradeshఏపీలో త్వరలో టెట్, డీఎస్సీ, బదిలీలు, భర్తీకి కసరత్తు

ఏపీలో త్వరలో టెట్, డీఎస్సీ, బదిలీలు, భర్తీకి కసరత్తు

TET-DSC-CONDUCTED-BY-AP-GOVERNMENT-SOON

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను నాడు–నేడు ద్వారా సమకూరుస్తున్నారు. పాఠసాలలో ఇప్పుడు రన్నింగ్‌ వాటర్‌తో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, కుర్చీలు, బెంచీలు, ర్యాకులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, భవనాలకు మరమ్మతులు, రంగులు ఇలా పలు రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు.

నాడు-నేడు లోని మొదటి దశ కింద సుమారు 15 వేలకు పైగా పాఠశాలలో ఈ పనులు మార్చి ఆఖరుకు పూర్తి చేయబోతున్నారు. ఇతర దశల పనులకు సంబంధించి కూడా ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉంచారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే తదుపరి చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ ప్రకటించటానికి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. 2018లో టెట్‌ రెండుసార్లు నిర్వహించిన అనంతరం మళ్లీ ఆ పరీక్షలు ఇప్పటివరకు జరగడానికి నోచుకోలెదు. డీఎడ్‌ పూర్తిచేసిన కొత్త బ్యాచ్‌ల అభ్యర్థులు టెట్‌ కోసం నిరీక్షిస్తున్నారు. వారు డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో తొలుత టెట్‌ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

కాగా ఈ సారి నిర్వహించ బోయే టెట్, డీఎస్సీ సిలబస్‌లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన నేపథ్యంలో కాబోయే ఉపాధ్యాయుల ఇంగ్లీషులో బోధనా నైపుణ్యాలను ముందుగానే పరీక్షించేలా చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి టెట్‌లో ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ కింద అదనంగా పరీక్ష నిర్వహించనున్నారు.

టెట్‌ –2021 నిర్వహించిన అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులో ఉన్న ఖాళీలన్నిటినీ భర్తీ చేసేలా పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఈ డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చే ముందు మరోసారి టీచర్ల బదిలీలకు అవకాశం కల్పించనున్నారు.

ఇక ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకోసం 2018లో నిర్వహించిన ప్రత్యేక డీఎస్సీలో 403 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా కొన్ని మాత్రమే భర్తీ అయ్యాయి. వాటికి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. 2018 జనరల్‌ డీఎస్సీకి సంబంధించి పలు న్యాయవివాదాలు తలెత్తడంతో ఆ పోస్టుల భర్తీ విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular