అంతర్జాతీయం: ఇజ్రాయెల్-గాజా యుద్ధం భీభత్సం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఏడాది పాటు కొనసాగుతున్న ఘర్షణలో గాజాలో ఇప్పటివరకు 43,000 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో సగానికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. గడచిన రెండు రోజులుగా ఆస్పత్రులకు చేరిన మృతదేహాల కారణంగా మృతుల సంఖ్య 43,020కి చేరుకుందని, గాయపడిన వారి సంఖ్య 1,01,110కి పెరిగినట్లు సమాచారం. అయినప్పటికీ, ఈ సంఖ్యలో పౌరులు, మిలిటెంట్లు ఎంతమంది ఉన్నారనే వివరాలను ఇంకా వెల్లడి చేయలేదు.
ఆస్పత్రి భూగర్భంలో హమాస్ మిలిటెంట్లు
ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ఇటీవల గాజా స్ట్రిప్‌లోని కమల్ అద్వాన్ ఆస్పత్రి భూగర్భంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. హమాస్ మిలిటెంట్ల గాలింపు క్రమంలో ఇక్కడ దాడి నిర్వహించగా, భూగర్భంలో దాగున్న 100 మంది హమాస్ మిలిటెంట్లు బంధించబడ్డారు. ఆ ప్రాంతంలో రోగుల తరలింపు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు, 88 మంది రోగులు, వారి సంరక్షకులు, సిబ్బందిని ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
ఇరాన్ హెచ్చరిక: ఇజ్రాయెల్‌పై ప్రతిస్పందన తప్పదా?
ఇజ్రాయెల్ ఇరాన్ మిలిటరీ బేస్‌లపై చేసిన దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ హుస్సేన్ సలామీ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ చమురు ఉత్పత్తి ప్రాంతాలకు దాడులు జరగకపోయినా, ఈ దాడులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని సలామీ హెచ్చరించారు.
చమురు ధరల్లో తగ్గుదల
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల మధ్య సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 6 శాతం తగ్గాయి. ఇజ్రాయెల్ ఇరాన్ చమురు ఉత్పత్తి ప్రాంతాల్లో దాడులు జరగకపోవడంతో చమురు సరఫరాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదనే సంకేతాల నేపథ్యంలో ధరలు తగ్గాయి.
ఐరాసలో ఇరాక్ నిరసన
ఇరాన్ పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని ఉల్లంఘించిందని ఇరాక్ ఆరోపించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని అతిక్రమించిందని, ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ మరియు భద్రతా మండలికి మెమోరాండం అందించి నిరసన తెలిపింది.